కొవిడ్ వ్యాక్సిన్ డేటా చోరీకి రష్యా హ్యాకర్ల తీవ్ర యత్నాలు... ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటన్

  • బ్రిటన్ లో కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు
  • హ్యాకర్ల చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న బ్రిటన్
  • రష్యా ప్రభుత్వ ప్రోద్బలిత హ్యాకర్లు అంటూ బ్రిటన్ మంత్రి వ్యాఖ్యలు
కరోనా రక్కసి నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని యావత్ ప్రపంచం నమ్ముతున్న వేళ బ్రిటన్ లో ప్రయోగ దశలో ఉన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఆశాకిరణంలా కనిపిస్తోంది. అయితే, బ్రిటన్ నుంచి రష్యా హ్యాకర్లు వ్యాక్సిన్ కు సంబంధించిన డేటాను తస్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు వెల్లడైంది. దీనిపై బ్రిటన్ భద్రతా మంత్రి జేమ్స్ బ్రోకెన్ షైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ప్రభుత్వ మద్దతుతోనే హ్యాకర్లు ఈ ప్రయత్నాలకు ఒడిగట్టారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

బ్రిటన్ కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్ సీఎస్ సీ) ఓ ప్రకటనలో ఈ హ్యాకింగ్ వివరాలు వెల్లడించింది. రష్యా ప్రభుత్వ ప్రోద్బలిత హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డేటాతో పాటు చికిత్స విధానాలపై జరుగుతున్న పరిశోధనల సమాచారాన్ని కూడా దొంగిలించేందుకు ప్రయత్నించారని తెలిపింది.

దీనిపై బ్రిటన్ మంత్రి బ్రోకెన్ షైర్ స్పందిస్తూ, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలు చేస్తున్న ఇతర దేశాల కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొరబడడం అనైతికం అని పేర్కొన్నారు. అయితే, ఆయా కంప్యూటర్ వ్యవస్థల సైబర్ భద్రత బలంగా ఉన్నందున ఎలాంటి డేటా చోరీకి గురికాలేదని వెల్లడించారు.


More Telugu News