వికాస్ దూబే ఎన్ కౌంటర్ 'తెలంగాణ 'ఘటనకు భిన్నంగా జరిగింది: సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీ పోలీసులు

  • ఇటీవల వికాస్ దూబే ఎన్ కౌంటర్
  • కాన్పూర్ వద్ద కాల్చిచంపిన పోలీసులు
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు
పక్కా ప్రణాళికతో ఎనిమిది మంది పోలీసులను బలిగొన్న కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబేను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చడం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టగా, యూపీ పోలీసులు అఫిడవిట్ సమర్పించారు. కాన్పూర్ వద్ద గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను కాల్చిచంపడం ఫేక్ ఎన్ కౌంటర్ కాదని స్పష్టం చేశారు. దూబే వ్యవహారాన్ని తెలంగాణ ఎన్ కౌంటర్ తో పోల్చలేమని వివరించారు.

తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ పై అక్కడి ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశించలేదని, కానీ యూపీ ప్రభుత్వం దూబే ఘటనపై న్యాయపరమైన విచారణకు ఆదేశించిందని తమ అఫిడవిట్ లో యూపీ డీజీపీ తెలియజేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సమయం ఇస్తే మరిన్ని వివరాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.

"తెలంగాణ ఎన్ కౌంటర్ తో పోల్చితే వికాస్ దూబే ఎన్ కౌంటర్ భిన్నమైనది. తెలంగాణ ఎన్ కౌంటర్ లో చనిపోయినవాళ్లు కరుడుగట్టిన నేరస్తులేమీ కాదు, కానీ, వికాస్ దూబేపై 64 కేసులు ఉన్నాయి" అని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. "వికాస్ దూబేను తీసుకువస్తున్న సమయంలో వాహనం బోల్తాపడిందనడానికి మా వద్ద 'మెటీరియల్ ఎవిడెన్స్' కూడా ఉంది. కానీ, తెలంగాణ ఎన్ కౌంటర్ సమయంలో నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదానికి పోలీసులు మాత్రమే సాక్షులు... వాళ్లు ఏం చెబితే అదే సాక్ష్యం!" అంటూ యూపీ పోలీసులు తమ అఫిడవిట్ లో వివరించారు.


More Telugu News