భారత్ క్షిపణి పరీక్ష విఫలమైందంటూ.. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియో హల్‌చల్‌!

  • భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్ వ్యాఖ్యల నేపథ్యంలో వీడియో వైరల్ 
  • రష్యా రాకెట్‌ పరీక్షకు సంబంధించిన వీడియో 
  • భారత్‌ క్షిపణి పరీక్షల వీడియో అంటూ రాతలు
భారత్ నిర్వహించిన ఓ క్షిపణి పరీక్ష విఫలమైందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారు. చైనా ప్రోత్సాహంతో భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌ వ్యాఖ్యలు చేస్తోన్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం. భారత క్షిపణి కుప్పకూలిపోయిందని, ఇటువంటి దేశ ఆర్మీ నేపాల్‌తో ఎలా యుద్ధం చేస్తుందని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే, ఇలా వైరల్ అయిన వీడియోలో వున్నది భారత్‌కు చెందిన క్షిపణి కాదు. 2013లో రష్యా రాకెట్‌ కుప్పకూలింది. అప్పట్లో ఇందుకు సంబంధించిన ఈ వీడియోను పలు మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి. ఆ వీడియోను కొందరు పోస్ట్ చేస్తూ, అది భారత్‌కు చెందిన క్షిపణి అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇమ్రాన్ ఇదోయా అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేయగా వేలాది వ్యూస్ వచ్చాయి. అనంతరం చాలా మంది దీన్ని షేర్‌ చేస్తుండడం గమనార్హం. అయితే, ఈ వీడియో చాలా కాలం క్రితం నుంచి ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోనే. ప్రోటాన్ ఎం క్రాష్ 2013 అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఈ వీడియోను 2014లో ‘మార్టిన్ విట్’ అనే యూట్యూబ్‌ చానెల్‌లో ‘ప్రోటాన్ ఎం రాకెట్ పేలుడు.. స్లో మోషన్’ అనే పేరుతోనూ అప్‌లోడ్‌ చేసింది. రష్యాకు చెందిన ఈ రాకెట్‌ పైకి ఎగరగానే తిరిగి మంటల్లో కాలిపోతూ కింద పడడం చూడొచ్చు.


More Telugu News