లడఖ్‌లో రాజ్‌నాథ్‌ పర్యటన.. బిపిన్ రావత్, నరవణెను కలిసిన రక్షణ మంత్రి

  • రాజ్‌నాథ్‌కు సైనిక అధికారుల స్వాగతం
  • సైనిక విన్యాసాలు ప్రదర్శించిన సిబ్బంది
  • రెండు రోజుల పాటు పరిస్థితిని సమీక్షించనున్న రాజ్‌నాథ్
భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత సైన్యం దీటుగా స్పందిస్తుండడంతో చైనా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, చైనాను నమ్మే పరిస్థితి లేకపోవడంతో భారత్‌ నిఘాను కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ రోజు ఉదయం లేహ్‌ చేరుకున్నారు. ఆయనకు అక్కడ సైనిక అధికారులు స్వాగతం పలికారు. చీఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ జనరల్‌ బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవణెలను లేహ్‌లో రాజ్‌నాథ్‌ కలిసి మాట్లాడారు.

రాజ్‌నాథ్ పర్యటన సందర్భంగా భారత ఆర్మీ టీ-90 ట్యాంక్స్‌, ఎంబీపీ ఇన్ఫాంట్రీ సిబ్బంది సైనిక విన్యాసాలు ప్రదర్శించారు. రాజ్‌నాథ్‌తో పాటు బిపిన్ రావత్‌, ఎంఎం నరవణె ఈ విన్యాసాలను తిలకించారు. భారత్‌లో జరిపిన చర్చల నేపథ్యంలో చైనా సైన్యం ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల నుంచి కొన్ని కిలోమీటర్ల మేరకు వెనక్కి వెళ్లిపోయింది.

ఇటీవల ప్రధాని మోదీ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఇక రాజ్ నాథ్ రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన, సైనిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన శ్రీనగర్‌కు కూడా‌ వెళ్లి  పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.


More Telugu News