చూస్తుంటే అప్పులను రూ. ఐదారు లక్షల కోట్లకు పెంచేలా ఉన్నారు: కేసీఆర్, కేటీఆర్‌పై భట్టి ఫైర్

  • రాష్ట్రం కరోనా గుప్పిట్లో ఉంటే కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు
  • కేటీఆర్‌కు ఇంగ్లిష్ మాట్లాడడం తప్ప పాలన చేతకాదు
  • చిన్నపాటి వర్షానికే ఉస్మానియాలోకి నీళ్లు: ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుని భయం గుప్పిట్లోకి జారుకుంటే ప్రజలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్య, వైద్యం వంటి వాటిని పక్కనపెట్టి సచివాలయ కూల్చివేత, నిర్మాణాల కోసం టెండర్లు పిలుస్తున్నారని అన్నారు. ఇక ఉన్న అప్పులు సరిపోవన్నట్టు కొత్త అప్పులు చేస్తున్నారని, ఇప్పటికే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని, వాటిని ఐదారు లక్షల కోట్లకు పెంచాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు తెచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌కు ఇంగ్లిష్ మాట్లాడడం తప్ప పాలన చేతకాదని భట్టి ఎద్దేవా చేశారు. నిన్న ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షానికి మురుగునీరు ఆసుపత్రిలోకి రావడం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కొత్త సచివాలయ నిర్మాణ పనులు ఆపేసి ఉస్మానియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News