పోలీస్ అధికారులు, డాక్టర్లు కరోనాతో చనిపోవడం మనసును కలచివేస్తోంది: పవన్ కల్యాణ్

  • ఇద్దరు సీఐలు, ఓ సీనియర్ వైద్యాధికారి మృతి
  • వారి పేర్లతో నివాళి కూడా అర్పించలేకపోతున్నామన్న పవన్
  • వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి
తిరుపతి, అనంతపురంలో ఇద్దరు సీఐలు కరోనా కారణంగా మరణించడం దురదృష్టకరమని, గుంటూరు జిల్లాలో ఓ సీనియర్ వైద్యాధికారితో పాటు ముగ్గురు జూనియర్ డాక్టర్లు కరోనాతో కన్నుమూయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. డిపార్ట్ మెంట్ లో మంచి గుర్తింపు సంపాదించుకుని, ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు అకాలమరణం చెందడం మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు.

కరోనా కట్టడి కోసం ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వారిలో కొందరు ఆ మహమ్మారికే బలైపోతుండడం బాధగా ఉందని, కొవిడ్ నిబంధనల కారణంగా వారి పేర్లతో నివాళి కూడా అర్పించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. కరోనాపై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య విభాగాలకు చెందిన వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పైస్థాయి అధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సిబ్బందికి అందుబాటులో ఉంచాలని సూచించారు. పోయిన మనిషిని ఎలాగూ తెచ్చివ్వలేరు, కనీసం వారు లేని లోటును తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, భారీగా పరిహారం ప్రకటించాలని పవన్ స్పష్టం చేశారు.


More Telugu News