అప్పుడు నచ్చిన సంచయిత ఇప్పుడెందుకు వ్యతిరేకమైంది?... చంద్రబాబును ప్రశ్నించిన 'మాన్సాస్' చైర్ పర్సన్

  • చంద్రబాబు తనను టార్గెట్ చేస్తున్నారన్న సంచయిత
  • టీడీపీ నేతలు చేసిందేమీ లేదని వెల్లడి
  • ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు
సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి ఓ ఇంటర్వ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తన తండ్రి వయసున్న వ్యక్తి తనపై దుష్ప్రచారం చేయడం బాధగా ఉందన్నారు. తమ కుటుంబంపై చంద్రబాబు, టీడీపీ నేతలు, బాబాయ్ అశోక్ గజపతిరాజు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో తాను సన ఫౌండేషన్ ద్వారా చారిటీ కార్యక్రమాలు చేశానని, అప్పుడు టీడీపీ నేతలకు నచ్చిన సంచయిత ఇప్పుడు ఎందుకు నచ్చడంలేదు? అని ప్రశ్నించారు.

మాన్సాస్ ట్రస్టు పగ్గాలను ఓ మహిళ అందుకోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అశోక్ గజపతిరాజుతో కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశం కల్పించారని, కానీ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన ఆశయాలను ఎలా కొనసాగిస్తారని ఎత్తిపొడిచారు.

మాన్సాస్ ట్రస్టు వ్యవహారాన్ని కేరళలోని ట్రావెన్ కోర్ వ్యవహారంతో ముడిపెడుతున్నారని, ఇది ఎలా సమంజసమో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు చెప్పాలని ప్రశ్నించారు. అయినా, టీడీపీ నేతలు గతంలో మాన్సాస్ ట్రస్టుకు చేసిన మేలు ఏమీ లేదని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానంలో, మాన్సాస్ ట్రస్టులో రాజకీయాలు వద్దంటూ హితవు పలికారు.


More Telugu News