సుశాంత్ ను దావూద్ గ్యాంగ్ హత్య చేసింది: 'రా' మాజీ అధికారి ఆరోపణ

  • హంతకుడి పేరుని ముంబై పోలీసులు చెప్పడం లేదు
  • బాలీవుడ్ సెలబ్రిటీలకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయి
  • సుశాంత్ 50 సిమ్ కార్డులు మార్చాడు
జూన్ 14న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి పలు కారణాలు వినిపించాయి. బాలీవుడ్ లో బంధుప్రీతి (నెపోటిజం) కారణంగా అవకాశాలు రాక చనిపోయాడని, మానసిక ఒత్తిడితో చనిపోయాడని ఇలా పలు వార్తలు వచ్చాయి. మరోవైపు, 'హూ కిల్డ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను చంపింది ఎవరు?)' అనే ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో 'రా' మాజీ అధికారి ఎన్కే సూద్ విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది.

సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని... అదొక ప్లాన్డ్ మర్డర్ అని వీడియోలో సూద్ తెలిపారు. హైలీ ప్రొఫెషనల్ మర్డర్ అని ఆయన చెప్పారు. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారని... అయితే అసలైన హంతకుడు ఎవరనే విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించడం లేదని తెలిపారు. దావూద్ గ్యాంగ్ కానీ, ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ కానీ ఈ కేసులో ఉండొచ్చని చెప్పారు.

సుశాంత్ సింగ్ ఎలాంటి సూసైడ్ నోట్ పెట్టలేదని... అయినప్పటికీ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని సూద్ ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో సుశాంత్ 50 సిమ్ కార్డులు మార్చాడని, దీనికి కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించారు. బాలీవుడ్ స్లార్టకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అతని టీమ్ నిర్వహించే పార్టీలకు బాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్తుంటారని... దావూద్ డబ్బు సంపాదించుకునేందుకు సహకరిస్తుంటారని, దీనికి ప్రతిఫలంగా వారికి కూడా డబ్బు వస్తుంటుందని తెలిపారు.


More Telugu News