తెలంగాణ సచివాలయ కూల్చివేతపై రేపటి వరకు స్టే పొడిగింపు

  • కూల్చివేతకు ముందు పర్యావరణ అనుమతులు లేవన్న పిటిషనర్
  • కూల్చివేతకు అవసరం లేదన్న అడ్వకేట్ జనరల్
  • ఖండించిన హై కోర్టు ధర్మాసనం
తెలంగాణ సచివాలయ కూల్చివేతపై గతంలో ఇచ్చిన స్టేను రేపటి వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. సచివాలయ కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్న పిటిషనర్ పీఎల్ విశ్వేశ్వరరావు తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనను అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ఖండించారు. కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదన్నారు.

అయితే, ఆయన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేయడమంటే  నిర్మాణానికి తిరిగి భూమిని సిద్ధం చేయడమేనని కోర్టు పేర్కొంది. స్పందించిన ఏజీ.. నిర్మాణ సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. దీంతో పర్యావరణ అనుమతిపై కేంద్రం రేపు వివరణ ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే తీర్పులుంటే సమర్పించాలని ఆదేశించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.


More Telugu News