సిఫారసు చేసిన ఫీజులనే వసూలు చేయండి: ఇంజినీరింగ్ ఫీజులపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

  • ఇంజినీరింగ్ ఫీజులపై ప్రైవేటు కాలేజీలకు సుప్రీంలో ఊరట
  • ఏఎఫ్ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులను వసూలు చేయాలని ఆదేశం
  • హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల కొట్టివేత
ఇంజినీరింగ్ కాలేజీల విషయంలో గతంలో సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన ధర్మాసనం 2019-20, 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు గాను అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్‌సీ) సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని ఆదేశించింది. గతేడాది జులై 23న ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ను సవాలు చేస్తూ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ ఎం. గంగారావుతో కూడిన ఏకసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారిస్తూ ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశిస్తూ జీవోను కొట్టివేసింది.

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయడంతో ఆ ఉత్తర్వులను పరిశీలించిన హైకోర్టు 2018-19 విద్యా సంవత్సరం ఫీజుకు, 2019 జూన్‌లో ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజుకు మధ్య ఉన్న తేడాలో 50 శాతాన్ని పాత ఫీజుకు కలిపి అమలు చేయాలని మార్పులు చేసింది. ఈ మేరకు జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది.

అయితే, ఈ ఆదేశాలు మింగుడుపడని ప్రైవేటు కళాశాలలు  హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. మూడేళ్లకుగాను ఏఎఫ్ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరాయి. జస్టిస్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ బీఆర్ గువాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిన్న ప్రైవేటు కాలేజీలకు ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసి సింగిల్‌ జడ్జి ఉత్తర్వులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


More Telugu News