బీజేపీని ఓడించడానికి పనిచేశా.. ఆ పార్టీలో ఎందుకు చేరతాను?: సచిన్‌ పైలట్

  • నేను బీజేపీలో చేరను
  • ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినే
  • నన్ను అవమానించడానికే ఆ ప్రచారం  
కాంగ్రెస్ అసంతృప్త నేత సచిన్‌ పైలట్‌ను డిప్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగిస్తూ ఆ పార్టీ నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై తొలిసారి సచిన్‌ పైలట్ మీడియాతో మాట్లాడుతూ... తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. తాను అటువంటి ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని వివరణ ఇచ్చారు.

బీజేపీలో తాను చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్‌ పైలట్ చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారం సరికాదని, తాను బీజేపీని ఓడించడానికి పని చేశానని, అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు చేరతానని ఆయన ప్రశ్నించారు.

మరోపక్క, కాంగ్రెస్‌ను వీడుతున్న నేతగానే ఆయనను ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. 'సచిన్‌ పైలట్ కాంగ్రెస్‌ను వీడడం బాధాకరం. మా పార్టీలో ఆయన ఓ సమర్థవంతమైన నాయకుడిగా భావించాను. పార్టీని వీడడానికి బదులుగా ఆయన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నించాల్సి ఉండాల్సింది' అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చెప్పారు. మరోవైపు, సచిన్‌ పైలట్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాగా, రాజస్థాన్‌లో ప్రభుత్వం పడిపోకుండా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నేతలు కూడా తదుపరి కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు.


More Telugu News