కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియలకు రూ. 15 వేలు: జగన్ ఆదేశం

  • కరోనాపై సమీక్ష నిర్వహించిన సీఎం 
  • క్వారంటైన్ల పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆదేశం
  • దీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
కరోనా బాధితులకు వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం జగన్ హెచ్చరించారు. అలాంటి ఆసుపత్రుల అనుమతులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. కరోనా బారిన పడి ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించిన జగన్... దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనాపై ఈరోజు జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్, డీజీపీ, వైద్య, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. బాధితులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై కూడా ఫోకస్ పెట్టాలని చెప్పారు. కరోనా సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లలో అన్నీ సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత అధికారులదేనని తెలిపారు. రానున్న వారం రోజుల పాటు అధికారులు ఈ అంశాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు.

కరోనాపై మనం దీర్ఘకాలం పోరాడాల్సిన అవసరం ఉందని... చేస్తున్న పనుల్లో నాణ్యత లేకపోతే ఫలితాలను సాధించలేమని జగన్ చెప్పారు. రానున్న రోజులను దృష్టిలో ఉంచుకుని వసతులను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా పరీక్షలు చేసేందుకు శాశ్వత కేంద్రాలు ఉండాలని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనా వచ్చిందనే అనుమానం వచ్చిన వ్యక్తి ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్ చేయాలి? ఏం చేయాలి? అనే విషయాలపై చైతన్యం కలిగించేలా హోర్డింగులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్షోభ సమయంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి మెరుగైన జీతాలను ఇవ్వాలని జగన్ అన్నారు.


More Telugu News