సహజ గుణం మరిచి మేకల మంద పక్కనే తలదాచుకున్న పెద్ద పులి

  • అసోంలో భారీ వర్షాలు
  • వరదల్లో చిక్కుకున్న కజిరంగా అభయారణ్యం
  • సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్న పులులు
అసోంలో ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. అపార వన్యప్రాణులకు ఆవాసంగా నిలుస్తున్న కజిరంగా అభయారణ్యం కూడా వరద నీటిలో చిక్కుకుంది. దాంతో అక్కడున్న కొన్ని పెద్దపులులు ప్రాణాలు నిలుపుకునేందుకు తలో దిక్కుకు వెళ్లిపోయాయి. వాటిలో ఒకటి కంధూలిమారి గ్రామంలో ప్రవేశించింది. కమల్ శర్మ అనే వ్యక్తికి చెందిన మేకల కొట్టంలో ప్రవేశించిన ఆ పెద్దపులి బతుకుజీవుడా అనుకుంటూ ఓ పక్కనే ఒదిగింది.

సాధారణ పరిస్థితుల్లో ఆకలేసినప్పుడు మేక కనిపిస్తే గుటుక్కుమనిపించే పులి... కళ్లెదురుగా అన్ని మేకలు కనిపిస్తున్నా సహజ గుణం మరిచి రాత్రంతా అక్కడే గడిపింది. వాటిలో ఒక్క మేకకు కూడా ఆ పులి హాని చేయలేదని ఇంటి యజమాని కమల్ శర్మ తెలిపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆ మేకలకు మేత వేసేందుకు వెళ్లిన కమల్ శర్మ తల్లి అక్కడ పులిని చూసి వణికిపోయింది. మేకల మధ్య అదేమిటో అనుకుని దాన్ని తాకి చూసిన ఆమెకు ఒళ్లు గగుర్పొడిచింది. ఇంట్లోకి వచ్చిన 15 నిమిషాల వరకు ఆమెకు వణుకు తగ్గలేదని శర్మ వెల్లడించాడు. ఆ పులిని తామందరం చూశామని, ఎంతో అలసిపోయి పడుకుందని భావించామని వివరించాడు. తెల్లవారడంతోనే ఆ పులి వెళ్లిపోయిందని శర్మ తెలిపాడు.


More Telugu News