బలాన్ని చూపించే ప్రయత్నం.. తన వర్గం ఎమ్మెల్యేతో వీడియో విడుదల చేసిన సచిన్ పైలట్

  • రాజస్థాన్‌లో ఎడతెగని రాజకీయ సంక్షోభం
  • నేడు మరోమారు సీఎల్పీ సమావేశం
  • సచిన్ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది 15 మంది ఎమ్మెల్యేలే
రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం గంటకోలా మారుతోంది. తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటించిన యువనేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తాజాగా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు తన వర్గం ఎమ్మెల్యేలతో ఓ వీడియోను విడుదల చేశారు. తనతో కలిసి వచ్చేందుకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన పైలట్ విడుదల చేసిన ఈ వీడియోలో 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపిస్తుండడం గమనార్హం. పైలట్ కార్యాలయం విడుదల చేసిన ఈ వీడియోలో సచిన్ కూడా కనిపించలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హర్యానాలోని మనేసర్‌లో ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, 109 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని నిన్న జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్గం ప్రకటించింది. గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు జైపూర్‌ శివారులో ఉన్న రిసార్టులో మకాం వేశారు. నేడు మరోమారు ఇక్కడే సీఎల్పీ సమావేశం జరగనుంది. నిన్న జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టిన పైలట్, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు నేడు కూడా హాజరు కావడం అనుమానంగానే ఉంది.


More Telugu News