కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలలకే యాంటీబాడీలు అదృశ్యం!

  • 90 మందిపై పరిశోధన చేసిన లండన్ కింగ్స్ కాలేజి
  • మూడ్నెల్ల తర్వాత కనిపించని యాంటీబాడీలు
  • రెండోసారి కరోనా సోకే అవకాశాలున్నాయంటున్న పరిశోధకులు
మానవ శరీరంలోకి ఏదైనా వైరస్ గానీ, ఇతర వ్యాధి కారకాలు కానీ ప్రవేశించినప్పుడు, రోగ నిరోధక వ్యవస్థ వెంటనే ప్రతిస్పందిస్తుంది. యాంటీబాడీలు విడుదలై ఆ వైరస్ లపై పోరాడి ఆరోగ్యం అందిస్తాయి. సాధారణంగా ఒకసారి విడుదలైన యాంటీబాడీలు శాశ్వతంగా శరీరంలో ఉంటాయి.

అయితే, కరోనా విషయంలో అలా జరగడంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న కొంతకాలానికే యాంటీబాడీలు అదృశ్యమవుతున్నాయని లండన్ లోని కింగ్స్ కాలేజి పరిశోధకులు తెలిపారు. కరోనా చికిత్స సందర్భంగా వ్యక్తి శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు కొన్ని నెలల తర్వాత కనిపించడంలేదని వివరించారు.

90 మంది కరోనా రోగులు కోలుకున్న మూడు నెలల తర్వాత వారి రక్తప్రవాహంలో యాంటీబాడీల కోసం పరీక్ష చేస్తే 16 శాతం మందిలోనే యాంటీబాడీలు కనిపించాయి. మిగతా వారిలో అసలు యాంటీబాడీలే లేవట. ఈ నేపథ్యంలో, కరోనా రెండోసారి సోకేందుకు అవకాశాలు ఉన్నట్టు భావించాల్సి వస్తోందని, దీనిపై ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కింగ్స్ కాలేజి పరిశోధకులు స్పష్టం చేశారు.


More Telugu News