కరోనా అనుమానితుల ఆందోళన.. ఒంగోలు క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత!

  • క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన కరోనా అనుమానితులు
  • క్వాలిటీ లేని ఆహారాన్ని పెడుతున్నారంటూ మండిపాటు
  • పది రోజులు అవుతున్నా టెస్టు రిపోర్టులు ఇవ్వడంలేదని ఆగ్రహం
ఒంగోలులోని కరోనా క్వారంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల వరకు తమకు టిఫిన్ కూడా పెట్టడం లేదని కరోనా అనుమానితులు ఆందోళన చేపట్టారు. తమకు అందిస్తున్న ఆహారం క్వాలిటీగా లేదని... పశువుకు వేసే ఆహారాన్ని తమకు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆహారాన్ని తింటే వాంతులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పరీక్షలు చేయించుకుని వారం, పది రోజులు అవుతోందని... ఇంత వరకు టెస్ట్ రిపోర్టులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికి ఇంత వరకు పరీక్షలు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. వరద బాధితులను కుక్కినట్టు... అందరినీ ఒకేచోట ఉంచారని మండిపడ్డారు. మాస్కులు, శానిటైజర్లను కూడా ఇవ్వడం లేదని... తాళాలు వేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చేందుకు వారు యత్నించారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.


More Telugu News