జగన్ కు లేఖ రాసిన తర్వాతే ముద్రగడపై సోషల్ మీడియాలో దాడి మొదలైంది: బోండా ఉమ

  • కాపు ఉద్యమంలో ముద్రగడ కొనసాగాలి
  • కాపులకు జగన్ అన్యాయం చేశారు
  • 13 జిల్లాల కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తాం
కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ నేత బోండా ఉమ స్పందిస్తూ, కాపు ఉద్యమంలో ముద్రగడ కొనసాగాలని విన్నవించారు. ముద్రగడపై వైసీపీ వాళ్లే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. అయినా, నాయకత్వం వహించే వారిపై విమర్శలు రావడం సహజమేనని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాపు రిజర్వేషన్ల గురించి సీఎం జగన్ కు ముద్రగడ లేఖ రాశారని... ఆ తర్వాతే  ఆయనపై సోషల్ మీడియాలో విమర్శల దాడి మొదలయిందని అన్నారు. కాపులకు జగన్ తీరని అన్యాయం చేశారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించిందని... జగన్ సర్కారు ఆ రిజర్వేషన్లను రద్దు చేసిందని చెప్పారు. 13 జిల్లాల కాపు నాయకులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాపుల కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ముందుకు రావాలని కోరారు.


More Telugu News