ఆలయ నిర్వహణ బాధ్యత రాజకుటుంబానిదే: అనంత పద్మనాభ స్వామి దేవాలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు

  • ఆలయ మేనేజ్‌మెంట్ వివాదంపై తీర్పు
  • ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా నిర్ణయం
  • ఆ ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగింత
  • ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ మేనేజ్‌మెంట్ వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి అనుకూలంగా జస్టిస్ యు.యు. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ ఆలయ నిర్వహణ బాధ్యతను రాజకుటుంబానికే అప్పగిస్తున్నట్లు చెప్పింది. అలాగే, ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి  నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని చెప్పింది.  

కాగా, ఆ ఆలయ సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్ కోర్ రాజవంశీయులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసి, ఈ రోజు ఈ తీర్పు వెల్లడించింది. 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున సంపదలు బయటపడిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆ ఆలయం వార్తల్లో నిలిచింది.


More Telugu News