రాజకీయ కక్షసాధింపులు మాని ఈ విషయం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు: దేవినేని ఉమ

  • జీవనోపాధి కోల్పోయి ఉపాధిలేక పూటగడవట్లేదు
  • వలస కూలీలు, చిరు వ్యాపారులు కష్టాలు పడుతున్నారు
  • తాడేపల్లి రాజప్రాసాదానికి వినిపించడం లేదా?
  • ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికీ చిరు వ్యాపారులు, కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. 'జీవనోపాధి కోల్పోయి ఉపాధిలేక పూటగడవక అలమటిస్తున్న వలస కూలీలు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారుల కష్టాలు తాడేపల్లి రాజప్రాసాదానికి వినిపించడంలేదా? కరోనా సమయంలో రాజకీయ కక్ష సాధింపులు మాని వారిని ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు' అని నిలదీశారు.

ఈ సందర్భంగా ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. నిర్మాణ రంగ కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, కంప్యూటర్లు, మొబైల్‌ సర్వీసు సెంటర్ల నిర్వాహకుల జీవితాలపై లాక్‌డౌన్‌ పిడుగు పడేలా చేసిందని అందులో ఉంది.

ప్రస్తుతం వారి వ్యాపారాలు సాగకపోవడంతో వారి కష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు గత ఏడాది జులై నుంచి ఆరు నెలల పాటు  ఇసుక లేక నిర్మాణ పనులు ఆగిపోవడంతో ఇబ్బందులు పడ్డ నిర్మాణ రంగ కార్మికులు, ఆ తర్వాత మూడు నెలల పాటు పనులు దొరకడంతో ఊరట లభించిందని, మళ్లీ రెండు నెలల పాటు ఇళ్లకే పరిమితమయ్యారని ఆ కథనంలో పేర్కొన్నారు. 


More Telugu News