అమితాబ్‌ బచ్చన్‌ చికిత్స తీసుకుంటోన్న ఆసుపత్రి, ఇళ్ల వద్ద భద్రత పెంపు

  • ఆసుపత్రి వద్ద ప్రజలు గూమికూడకుండా చర్యలు 
  • అమితాబ్ నివాసం వద్దకు బృహన్ ముంబై మునిసిపల్  సిబ్బంది
  • ఇంటి గేటుకు బ్యానర్.. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటన
  • బచ్చన్ నివాసాల వద్ద  శానిటైజ్‌ పనులు 
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్ (77)‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ (44)కు క‌రోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఆయన నివాసంతో పాటు ఆయన చికిత్స తీసుకుంటోన్న ఆసుపత్రి వద్ద భద్రతా సిబ్బందిని పెంచారు.

ముంబైలోని జుహు ప్రాంతంలోని ఆయన రెండు బంగ్లాలతో పాటు, నానావతి ఆసుపత్రి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద అభిమానులు గూమి కూడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. ఆ ఆసుపత్రి వద్ద ఇతర కరోనా రోగులు కూడా ఉన్నారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని అన్నారు.

కాగా, అమితాబ్ నివాసం వద్దకు చేరుకున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్  సిబ్బంది ఆ ఇంటి గేటుకు ఓ బ్యానర్ అంటించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు అందులో ఉంది. అమితాబ్ బచ్చన్ నివాసాల వద్ద మునిసిపల్ సిబ్బంది శానిటైజ్‌ పనులు కొనసాగిస్తున్నారు.


More Telugu News