ధోనీ అనేక కప్పులు గెలిచాడంటే అందుకు కారణం గంగూలీనే: గంభీర్

  • అన్ని ఫార్మాట్లలో విజయవంతమైన ధోనీ
  • ధోనీకి అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టు లభించిందన్న గంభీర్
  • గంగూలీ వల్లే భారత్ బలమైన జట్టుగా ఎదిగిందని వెల్లడి
టీమిండియా క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతమైన సారథిగా పేరొందాడు. అన్ని ఫార్మాట్లలో జట్టును ప్రపంచ విజేతగా నిలపడం ధోనీకే సాధ్యమైంది. అయితే ధోనీ సాధించిన ట్రోఫీల వెనుక సౌరభ్ గంగూలీ శ్రమ దాగివుందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు. గంగూలీ నాయకత్వంలో మేటి ఆటగాళ్లుగా ఎదిగిన క్రికెటర్లు ధోనీకి ఎంతో ఉపయోగపడ్డారని తెలిపాడు.

గంగూలీ ఎంతో శ్రమించి జట్టును బలోపేతం చేశాడని, ఆ తర్వాత వచ్చిన ధోనీ అదృష్టం కొద్దీ అగ్రశ్రేణి ఆటగాళ్ల అండతో గణనీయమైన విజయాలు సాధించాడని గంభీర్ పేర్కొన్నాడు. "ధోనీ సారథ్యంలో టీమిండియా టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ గా ఎదిగిందంటే అందుకు కారణం జహీర్ ఖాన్. ధోనీకి జహీర్ వంటి సిసలైన ఫాస్ట్ బౌలర్ దొరకడం ఓ వరం అని చెప్పాలి. ఈ క్రెడిట్ అంతా గంగూలీకి దక్కుతుంది. ఎందుకంటే జహీర్ ను అగ్రశ్రేణి బౌలర్ గా మలిచింది గంగూలీనే.

ధోనీ ఎంతో లక్కీ కెప్టెన్. ప్రతి ఫార్మాట్ లోనూ అద్భుతమైన ఆటగాళ్లతో కూడిన జట్టు లభించింది. 2011 వరల్డ్ కప్ లో సచిన్, సెహ్వాగ్, నేను, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లం అందుబాటులో ఉన్నాం. ధోనీ ఇంత పటిష్టమైన జట్లు పొందగలిగాడన్నా, అనేక విజయాలు సాధించాడన్నా అందుకు కారణం గంగూలీ కఠోర శ్రమే" అని గంభీర్ వివరించాడు.


More Telugu News