చైనా యాప్ లకు మరో అవకాశం... ప్రశ్నావళిని పంపిన కేంద్రం!

  • చైనా యాప్ లకు నోటీసులు పంపిన కేంద్రం
  • 79 ప్రశ్నలతో నోటీసులు
  • జూలై 22 లోపు స్పందించకపోతే పూర్తిస్థాయిలో నిషేధం
చైనాతో సరిహద్దు ఘర్షణల అనంతరం ఆ దేశానికి చెందిన యాప్ లను కేంద్రం నిషేధించడం తెలిసిందే. టిక్ టాక్, యూసీ బ్రౌజర్, హలో యాప్ సహా 59 యాప్ లను కేంద్రం అడ్డుకుంది. అయితే, ఈ యాప్ లకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు ఆయా యాప్ లు కేంద్రం పంపించే నోటీసులకు సవివరంగా జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రతి యాప్ యాజమాన్యానికి 79 ప్రశ్నలతో కూడిన నోటీసులు పంపారు. ఈ నోటీసులకు జూలై 22 లోపు బదులు ఇవ్వాల్సి ఉంటుందని, గడువులోపల స్పందించని యాప్ లను పూర్తిగా నిషేధిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కో యాప్ మాతృసంస్థ, కార్పొరేట్ మూలాలు, నిధులు, డేటా మేనేజ్ మెంట్ కు సంబంధించిన ప్రశ్నలను నోటీసుల్లో పొందుపరిచారు.

యాప్ ల యాజమాన్యాలు ఇచ్చే సమాధానాలను విశ్లేషించేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర దేశాల నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో ఆయా యాప్ లు ఇచ్చే వివరాలను పోల్చుకుని తుది నిర్ణయం తీసుకుంటారు.


More Telugu News