లాక్ డౌన్ తర్వాత కరోనా తగ్గకపోతే మంత్రిమండలి రద్దు... కజక్ అధ్యక్షుడి తీవ్ర నిర్ణయం

  • కజకిస్థాన్ లో రెండోపర్యాయం లాక్ డౌన్
  • జూలై 5 నుంచి అమలు
  • కరోనా తగ్గకపోతే ప్రభుత్వ సమర్థతను ప్రశ్నిస్తారన్న అధ్యక్షుడు
కరోనా రక్కసిని ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ఓ ఆయుధమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్రజల కదలికలను తగ్గించగలిగితే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కజకిస్థాన్ లో రెండో విడత లాక్ డౌన్ ను జూలై 5 నుంచి అమలు అయితే, ఈసారి కరోనా తగ్గకపోతే మంత్రిమండలిని రద్దు చేస్తానంటూ దేశాధ్యక్షుడు కాసిమ్ జోమార్ టొకయేవ్ సంచలన నిర్ణయం ప్రకటించారు.

రెండో విడత లాక్ డౌన్ రెండు వారాల పాటు కొనసాగుతుందని, దేశంలో కరోనా నిర్మూలన బాధ్యత మంత్రులపైనే ఉందని టొకేయేవ్ స్పష్టం చేశారు. రెండు సార్లు లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా పరిస్థితుల్లో మార్పు రాకపోతే ప్రభుత్వ సమర్థతపై సందేహాలు వస్తాయని, మంత్రిమండలి కూర్పుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని అన్నారు. కాగా, కజకిస్థాన్ లో ఇప్పటివరకు 55 వేల వరకు కరోనా కేసులు వచ్చాయి. 264 మరణాలు సంభవించాయి. గురువారం అత్యధికంగా 1,962 పాజిటివ్ కేసులు రావడంతో అక్కడి ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది.


More Telugu News