ఇరాక్ లో తెలంగాణ కార్మికుడి ఆకలి చావు

  • కరోనాతో ఇరాక్ లో లాక్ డౌన్ పరిస్థితులు
  • ఉపాధి కోల్పోయి తిండిలేక అలమటించిన కార్మికుడు
  • ఇరాక్ లోనే ఉండిపోయిన మృతదేహం
తెలంగాణ నుంచి పొట్టచేతపట్టుకుని పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి పరిస్థితి ఇప్పటికీ దుర్భరంగా ఉంది. అయినవారికి దూరంగా కాసుల కోసం కష్టం పడుతూ, తమ ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, ఇరాక్ లో ఓ తెలంగాణ కార్మికుడు దయనీయ పరిస్థితుల్లో తనువు చాలించాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఆకలితో అలమటించి చనిపోయాడు.

అతడి పేరు పర్యామోల భోజన్న (46). కొన్నాళ్లుగా ఇరాక్ లోని ఎర్బిల్ పట్టణంలో చిక్కుకుపోయాడు. విదేశాల్లో పని చూపిస్తానని ఓ ఏజెంట్ చెప్పడంతో నమ్మి మోసపోయాడు. ఆ ఏజెంట్ ఉద్యోగం ఇప్పించకపోవడంతో అక్కడే ఇతర తెలంగాణ వ్యక్తులతో కలిసి కార్మికుడిగా కొనసాగాడు. ఇటీవల కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధించడంతో భోజన్న, తదితర తెలంగాణ కార్మికులకు ఉపాధి కరవైంది. వారందరూ తమను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఓ వీడియో ద్వారా కోరారు.

అయితే, ఉపాధి లేకపోవడంతో తినడానికి తిండి కూడా కరవై భోజన్న మృత్యువాత పడ్డాడు. జూన్ 29 నుంచి అతడి మృతదేహం ఎర్బిల్ లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. ఎలాగైనా తన భర్త మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ భార్య అందరినీ వేడుకుంటోంది. దీనిపై తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కార్మికుడి మృతి గురించి ఎర్బిల్ లోని భారత కాన్సులేట్ అధికారులతో మాట్లాడామని, వందేభారత్ మిషన్ లో భాగంగా విదేశాలకు వస్తున్న భారత విమానాల్లో భోజన్న మృతదేహం తరలించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News