తన మేనల్లుడి సినిమా పిచ్చిని వదిలించమని అప్పట్లో కోన వెంకట్ ను కోరిన వైఎస్సార్!

  • వైఎస్ కు నివాళులు అర్పించిన కోన వెంకట్
  • గతంలో వైఎస్ తో అనుభవాన్ని వివరించిన సినీ రైటర్
  • ఎలా స్పందించాలో అర్థంకాలేదన్న కోన
ఇవాళ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులందరూ ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ కూడా వైఎస్సార్ తో ఓ ఆసక్తికర అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో వైఎస్సార్ సీఎంగా ఉన్నారని, ఆ సమయంలో తాను చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే అదే విమానంలో ఉన్న వైఎస్సార్ పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారని కోన వెంకట్ వెల్లడించారు.

"ఈ మధ్య నీ గురించి అందరూ బాగా చెప్పుకుంటున్నారు. మంచి హిట్లు పడినట్టున్నాయి అన్నారు. దాంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పాను. ఆపై ఆయన, ఓసారి మా ఇంటికి రావాలి అన్నారు. ఎందుకు సార్ అని అడిగాను. కడపలో మా మేనల్లుడు ఉన్నాడు. సినిమా థియేటర్ల బిజినెస్ లో ఉన్నాడు. ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నాడు అని వైఎస్సార్ చెప్పారు. దాంతో ఏదైనా కథ కావాలని అడుగుతారేమో అని ఊహించాను.

కానీ వైఎస్సార్ చెప్పింది విన్న తర్వాత ఎలా స్పందించాలో తెలియలేదు. వెంకట్, మా వాడితో మాట్లాడి ఎలాగైనా సినిమా తీయాలన్న ఆలోచన మాన్పించాలని అన్నారు. అంతేకాదు, నువ్వు ఓ సినిమా తీసి ఎలా నష్టపోయావో కూడా మా వాడికి వివరించు అని చెప్పారు" అంటూ నాటి విషయాలను కోన వెంకట్ వెల్లడించారు.


More Telugu News