'విత్తనాలు ఇవ్వలేని తనయుడు... వ్యవసాయరంగాన్ని ఛిన్నాభిన్నం చేసిన తండ్రి'.. అంటూ లోకేశ్ వ్యాఖ్యలు

  • ఈ రోజు జగన్ రైతు దగా దినోత్సవం అంటూ లోకేశ్ వ్యంగ్యం
  • ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ ఆగ్రహం
  • రంగుల లోకం తప్ప రైతులకేమీ ఒరగలేదని విమర్శలు
నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం జరుపుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. 'తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేయడం దారుణం' అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ఈ రోజు వైఎస్ జగన్ రైతు దగా దినోత్సవం అంటూ ఎద్దేవా చేశారు. 'విత్తనాలు ఇవ్వలేని కొడుకు... 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయరంగాన్ని ఛిన్నాభిన్నం చేసిన తండ్రి' అంటూ ఘాటుగా విమర్శించారు.

బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కోత, భరోసా పథకంలో కోత విధించారని, పంటలకు గిట్టుబాటు ధర, ఏడాదికి లక్ష రూపాయల లబ్ది గల్లంతయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీ పథకానికి పేరు మార్చారని, ఉచిత విద్యుత్ కు పేరు మార్చారని ఆరోపించారు. వైసీపీ రంగుల లోకం తప్ప రైతన్నకు ఒరిగిందేమీ లేదని లోకేశ్ విమర్శించారు.


More Telugu News