మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన భార్య.. కరోనా భయంతో ఇంటికి తాళం వేసి పరారైన భర్త

  • లాక్‌డౌన్ కారణంగా పంజాబ్‌లో చిక్కుకుపోయిన భార్య
  • మూడు నెలల తర్వాత ఇంటికొస్తే రానివ్వని భర్త
  • తాళం పగలగొట్టి లోపలికి పంపిన పోలీసులు
లాక్‌డౌన్ కారణంగా పంజాబ్‌లో చిక్కుకుపోయి మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన భార్యను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడో భర్త. ఆమె ద్వారా తనకు ఎక్కడ కరోనా అంటుకుంటుందో అన్న భయంతో ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌కు చెందిన దంపతులు కుమారుడితో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. మార్చిలో తన పదేళ్ల కుమారుడిని తీసుకుని భార్య చండీగఢ్ వెళ్లింది. అదే నెలలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయింది.

తాజాగా, విమాన సేవలు అందుబాటులోకి రావడంతో ఆమె తిరిగి బెంగళూరు చేరుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు ఆమెను క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా, క్వారంటైన్ ముగించుకుని ఇంటికి వెళ్లగా కరోనా భయంతో ఆమెను ఇంట్లోకి రానిచ్చేందుకు భర్త నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి తిరిగి వచ్చేలోగా ఇంటికి తాళం వేసి భర్త పరారయ్యాడు. దీంతో పోలీసులు తాళం పగలగొట్టి ఆమెను ఇంట్లోకి పంపారు. అలాగే, పరారైన అతడి కోసం గాలిస్తున్నారు.


More Telugu News