సికింద్రాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రి దారుణం.. కరోనా రోగి మృతి.. రెండు వారాల చికిత్సకు రూ. 12 లక్షల బిల్లు!

  • రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు కరోనా పరీక్షలు
  • ఒకసారి నెగటివ్, మరోసారి పాజిటివ్
  • కుటుంబ సభ్యుల ఆందోళనతో మృతదేహాన్ని అప్పగించిన ఆసుపత్రి
తెలంగాణలోని యాదగిరి గుట్టకు చెందిన 28 ఏళ్ల యువకుడు గత నెల 23న అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. గత నెల 24న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటిగ్‌గా తేలగా, 26న మరోమారు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అక్కడే రెండు వారాలుగా చికిత్స తీసుకున్న యువకుడి పరిస్థితి విషమించడంతో నిన్న ఉదయం మృతి చెందాడు. యువకుడి వైద్యం కోసం బాధిత కుటుంబం అప్పటికే రూ. 6.50 లక్షలు చెల్లించింది.

నిన్న యువకుడి మృతి అనంతరం మొత్తం రూ. 12 లక్షలు అయిందంటూ ఆసుపత్రి యాజమాన్యం బిల్లు చేతిలో పెట్టడంతో అసలే బాధలో ఉన్న కుటుంబం అది చూసి షాక్‌కు గురైంది. పొలం అమ్మగా వచ్చిన రూ. 6.50 లక్షలను ఇప్పటికే కట్టేశామని, ఇక తమ వద్ద పైసా కూడా లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం చివరికి యువకుడి మృతదేహాన్ని కుటుంబానికి అందించడంతో కథ సుఖాంతమైంది.


More Telugu News