కేంద్రానికి మూడు ప్రశ్నలను సంధించిన రాహుల్ గాంధీ

  • జాతీయ ప్రయోజనాలను కాపాడటమే కేంద్రం విధి
  • సరిహద్దుల్లో యథాస్థితి కోసం ఎందుకు పట్టుబట్టలేదు?
  • మన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఎందుకు ప్రస్తావించలేదు?
గాల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి కేంద్రంపై మండిపడ్డారు.

ఆదివారం నాడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో వీడియో కాల్ ద్వారా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడారు. చర్చల తర్వాత చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లాయి. అయితే పత్రికా ప్రకటనలో మాత్రం... గాల్వాన్ లోయలో తప్పు ఎవరు చేశారో చాలా స్పష్టంగా తెలుస్తోందని... తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడూ కట్టుబడే ఉంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఈ ప్రకటనను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కేంద్రానికి మూడు ప్రశ్నలను సంధించారు.

జాతీయ ప్రయోజనాలను కాపాడటమే భారత ప్రభుత్వ ప్రధాన విధి అని రాహుల్ అన్నారు. సరిహద్దుల్లో యథాస్థితిని కొనసాగించేందుకు ఎందుకు పట్టుబట్టలేదని ప్రశ్నించారు. నిరాయుధులైన మన 20 మంది సైనికుల మరణాలను సమర్థించుకునే అవకాశాన్ని చైనాకు ఎందుకిచ్చారని అడిగారు. గాల్వాన్ లోయలో మన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.


More Telugu News