పేదలకు ఇళ్లు కట్టించడంలోనూ కక్కుర్తి పడుతున్నారు: చంద్రబాబు

  • టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం
  • పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఆవేదన
  • శ్మశానాలను కూడా వదలడంలేదని విమర్శలు
వైసీపీ నేతలు పేదలకు ఇళ్లు కట్టించే విషయంలో దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్వార్థం కోసం ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడికక్కడ కుంభకోణాలు చేస్తూ, వైసీపీ నేతలు తమ పొట్టలు పెంచుకుంటున్నారని విమర్శించారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఇదే దృశ్యం కనిపిస్తోందని అన్నారు.

"రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఇష్టానుసారం దోపిడీ చేశారు. ఇప్పటికీ వాళ్లు కట్టిన ఇళ్లు ఎక్కడా లేవు, మేం కట్టిన ఇళ్లే ఉన్నాయి. సొంత ఇల్లు అనేది ఓ సెంటిమెంట్ అనే భావన కలిగేలా ప్రతి కుటుంబంలో ఆత్మవిశ్వాసం కలిగించాం. 25,57,000 ఇళ్లకు శ్రీకారం చుట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్లకు పునాదులు వేశాం. 9.94 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. పట్టణ ప్రాంతాల్లో  7.24 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టాం. 1 ప్లస్ 2, 1 ప్లస్ 3 ఇళ్లు వాటిలో ఉన్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మేం చేసిన ఇళ్లలో 4.37 లక్షల ఇళ్లు రద్దు చేశారు. ఇప్పటికీ 2 లక్షల మందికి పైగా బకాయిలు ఉన్నాయి.

మేం కట్టిన ఇళ్లను కరోనా క్వారంటైన్ సెంటర్లుగా మార్చుతున్నారు. గ్రామాల్లో మేం రెండున్నర సెంట్ల స్థలం ఇస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని ఒకటిన్నర సెంటుకు తగ్గించింది. పట్టణ ప్రాంతాల్లో మేం రెండు సెంట్ల స్థలం ఇస్తే వీళ్లు ఒక సెంటే ఇస్తామనే పరిస్థితి వచ్చింది. కుప్పంలో ఏం పాపం చేశారని ఆ పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నారు? పేదల ఇళ్ల పేరుతో ఈ నాయకులు భారీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఈ పథకాలన్నీ కుంభకోణాలు కింద మారాయి. పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ రాష్ట్ర ఖజానా కొల్లగొడుతున్నారు.

ఇవాళ 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. పేదవాళ్లు ఇళ్లు కడితే వాటిని ఎందుకు కూలగొట్టారో చెప్పండి. పేదవాళ్లు ఇల్లు కట్టుకునే సమయంలో వాళ్లకి ఇవ్వాల్సిన సొమ్ము ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు పూర్తి చేసి ఎందుకు ఇవ్వడంలేదు? సొంతూర్లలో ఇళ్లు ఇవ్వకుండా పది కిలోమీటర్ల అవతల స్థలాలు ఇవ్వడం ఏంటి?

గ్రామ అవసరాలకు ఉన్న భూములను, స్కూళ్లు, ఆడుకునే ఆటస్థలాలు, చెరువులను, శ్మశానాలను కూడా లాక్కునే స్థితికి వచ్చారు. మడ అడవులు, ఆవ భూములను కూడా వదలడంలేదు. లాగేసుకున్న భూముల ధరలు రెండున్నర రెట్లు పెంచేసి వీళ్లు దోచుకుంటున్నారు. చివరికి పేదవాళ్లకు ఇళ్లు కట్టించడంలోనూ కక్కుర్తి పడుతున్నారు" అంటూ విమర్శలు గుప్పించారు.


More Telugu News