ఇంత దుర్మార్గమా సీఎం కేసీఆర్‌?: సచివాలయం కూల్చివేతపై టీపీసీసీ నేతల ఆగ్రహం

  • డాక్టర్లకు తగినన్ని పీపీఈ కిట్లు ఇవ్వట్లేదు
  • ప్రజలకు సరిపడా కరోనా టెస్టులు చేయించడం లేదు
  • వీటి  కన్నా సచివాలయం కూల్చేయడానికే కేసీఆర్ ప్రాధాన్యత
  • ఈ సమయంలో కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు ఈ రోజు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై టీపీసీసీ నేతలు మండిపడుతున్నారు. డాక్టర్లకు తగినన్ని పీపీఈ కిట్లు ఇవ్వడం కన్నా, ప్రజలకు సరిపడా కరోనా టెస్టులు చేయించడం కన్నా సచివాలయం భవనాలు కూల్చేయడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.

సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోనూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కి ప్రజల బాధలకంటే తన పట్టుదలే ప్రాధాన్యతగా ఉందని విమర్శించారు. 

కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని గుర్తు చేశారు. అలాగే, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని ఇలాంటి సమయంలో కొత్త సచివాలయం అవసరమా? అని నిలదీశారు. కేసీఆర్ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలని కోరారు.
 
సెక్రటేరియట్ కూల్చే సరైన సమయం ఇదేనా? అంటూ టీపీసీసీ ప్రశ్నించింది. 'ఒక దిక్కు రాష్ట్రములో ప్రజలు కరోనాతో నరకం అనుభవిస్తుంటే, మరో దిక్కు తానూ ఎన్నడూ రాని సెక్రటేరియట్‌ను కూల్చి కొత్తది కట్టే పనిలో ఉన్న నిత్య అసత్యపరుడు కేసీఆర్' అంటూ విరుచుకుపడింది. ఇంత దుర్మార్గమా కేసీఆర్‌? అంటూ ప్రశ్నించింది. 



More Telugu News