గోవా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బేఖాతరు.. ‘లాక్‌డౌన్ పార్టీ’లో పాల్గొన్న సొంత పార్టీ ఎమ్మెల్యే

  • హోటల్ గదిలో 40 మంది యువకుల లాక్‌డౌన్ పార్టీ
  • అక్కడ తాను కొన్ని నిమిషాలే ఉన్నానన్న ఎమ్మెల్యే
  • పార్టీకి అనుమతి ఉందన్న బీజేపీ కౌన్సిలర్
గోవా బీజేపీ ఎమ్మెల్యే గ్లెన్ సౌజా టిక్లో ‘లాక్‌డౌన్ పార్టీ’కి హాజరై విమర్శలకు తెరలేపారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో సామాజిక దూరం నిబంధనలు కచ్చితంగా పాటించాలని, పార్టీలకు దూరంగా ఉండాలని సీఎం ప్రమోద్ సావంత్ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన అలా అభ్యర్థించి ఒక్క రోజైనా కాకముందే ఆ పార్టీ ఎమ్మెల్యే టిక్లో ఓ పార్టీకి హాజరు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురుస్తోంది.

ఆ వీడియో ప్రకారం..  బీజేపీ కౌన్సిలర్ ఫ్రాన్సిస్కో కర్వాలోతోపాటు కొందరు యువకులు ఓ హోటల్ గదిలో పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే టిక్లో హాల్‌లోకి ప్రవేశించారు. ఆయనను చూసిన యువకుల్లో ఒకరు ‘ప్రత్యేక అతిథి వచ్చేశారు.. లాక్‌డౌన్ పార్టీ’ అని గట్టిగా అరవడం వినిపించింది. పార్టీకి హాజరైన ఎమ్మెల్యే చేతులు ఊపుతూ, కరచాలనం చేశారు. ఈ పార్టీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే స్పందించారు. తన సన్నిహిత మిత్రుడొకరు పిలిస్తే పార్టీకి వెళ్లానని, అక్కడ తానున్నది కొన్ని నిమిషాలేనని సమర్థించుకున్నారు. అక్కడ ఉన్నంత సేపూ సామాజిక దూరం పాటించానని చెప్పుకొచ్చారు. విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈ పార్టీలో దాదాపు 40 మంది వరకు పాల్గొన్నట్టు వీడియోను బట్టి తెలుస్తోంది. ఇదే పార్టీలో చిందేసిన బీజేపీ కౌన్సిలర్ ఫ్రాన్సిస్కో మాట్లాడుతూ.. పార్టీకి అనుమతి ఉందని పేర్కొన్నారు. ‘లాక్‌డౌన్ పార్టీ’పై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించనున్నట్టు తెలిపారు. 


More Telugu News