రెమ్‌డిసివిర్ తయారీకి మైలాన్‌కు గ్రీన్ సిగ్నల్.. 100 ఎంజీ ఇంజక్షన్ ధర రూ.4,800

  • తయారీ, అమ్మకాలకు డీసీజీఐ నుంచి అనుమతి
  • డ్రెసెమ్ బ్రాండ్‌తో వస్తున్న ఔషధం
  • ఈ నెలలోనే అందుబాటులోకి
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయగలదని భావిస్తున్న రెమ్‌డిసివిర్ జనరిక్ ఔషధ తయారీ, విక్రయం కోసం ఫార్మా దిగ్గజ సంస్థ మైలాన్ ఎన్‌వీకి అనుమతి లభించింది. ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు తమకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్టు ఫార్మా కంపెనీ ప్రకటించింది. ఇంజక్షన్ రూపంలో తాము అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, 100 ఎంజీ వయల్ (ఇంజక్షన్) ధర రూ. 4800 అని పేర్కొంది. డ్రెసెమ్ బ్రాండ్‌తో ఈ నెలలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ధరకే రెమ్‌డిసివిర్‌ను అందించనున్నట్టు పేర్కొంది. కాగా, ఈ ఔషధ తయారీకి సిప్లా, హెటిరోలు ఇప్పటికే అనుమతి పొందాయి. పేద, మధ్యతరగతి ఆదాయ వ్యవస్థలు కలిగిన 127 దేశాల్లో రెమ్‌డిసివిర్ ఔషధాన్ని తయారు చేసి విక్రయించనున్నట్టు మైలాన్ తెలిపింది. ఇందుకు సంబంధించి గిలీడ్ సైన్సెస్ కంపెనీ నుంచి లైసెన్స్ పొందినట్టు ఆ సంస్థ అధ్యక్షుడు రాజీవ్‌ మాలిక్‌ తెలిపారు. ఔషధ విక్రయానికి మాత్రం భారత్‌లోనే తొలి అనుమతి లభించిందని పేర్కొన్నారు.


More Telugu News