అసత్య ప్రకటనలు చేసిన కేసీఆర్ పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్ డిమాండ్

  • కరోనా కట్టడిలో కేసీఆర్ విఫలమయ్యారన్న సంజయ్
  • పాత్రికేయులపై అక్రమకేసులు బనాయిస్తున్నారని ఆరోపణ
  • కక్ష సాధింపులకు కేసీఆర్ పర్యాయపదంగా మారారని విమర్శలు
పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే కరోనా సోకదని, 20 డిగ్రీల వేడితో కరోనా క్రిములు జీవించలేవని యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ తప్పుదోవపట్టించారంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.

వేడి నీళ్లు తాగితే కరోనా రాదని మంత్రులు కూడా మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనాపై అసత్య ప్రకటనలు చేసిన కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యలకు, అణచివేతలకు సీఎం కేసీఆర్ పర్యాయపదంగా మారారని, కరోనాపై తప్పుడు వార్త ప్రచురించారంటూ ఖమ్మంకు చెందిన ఓ విలేకరిపై అక్రమ కేసులు బనాయించారంటూ మండిపడ్డారు.

పత్రికా యాజమాన్యాలకు, విలేకరులకు కరోనా రావాలని శపించిన కేసీఆర్ వైఖరిని ప్రజలంతా గమనించారని తెలిపారు. అనేక జిల్లాల్లో కరోనా విజృంభిస్తున్నా విస్తృతస్థాయిలో రాష్ట్రం మొత్తం కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ విషయంపై పత్రికల్లో రోజూ కథనాలు వస్తుండడంతో ఆ పత్రికలపైనా, పాత్రికేయులపైనా కక్ష గట్టి అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News