విపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేయకూడదో రాహుల్ అదే చేస్తారు: నడ్డా విమర్శలు

  • ప్రశ్నలే తప్ప సమావేశాలకు రారేంటన్న నడ్డా
  • విపక్షనేతకు ఉండాల్సిన లక్షణాల్లేవంటూ విమర్శలు
  • వారసత్వ సంప్రదాయం అంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఎప్పుడూ ప్రశ్నలే తప్ప ఒక్కసారి కూడా రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకాలేదని విమర్శించారు. బాధ్యతాయుతమైన విపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చేయకూడదో రాహుల్ అదే చేస్తారని నడ్డా వ్యాఖ్యానించారు. కిందటేడాది ఏర్పాటైన రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఇప్పటివరకు 11 సార్లు సమావేశమైతే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాహుల్ హాజరుకాకపోవడంపై నడ్డా అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారత సైనికుల వీరత్వాన్ని అదేపనిగా ప్రశ్నిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాహుల్ రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉంటూ తనలోని నాయకత్వ లేమిని చాటుకుంటున్నారని విమర్శించారు. రాహల్ గాంధీ వారసత్వ రాజకీయ సంప్రదాయానికి చెందిన వ్యక్తి అని, పార్లమెంటరీ వ్యవహారాలను అర్థం చేసుకునే అర్హత ఉన్న అనేకమంది నేతలు కాంగ్రెస్ లో ఉన్నా, ఆ పార్టీలోని వారసత్వం వారిని ఎదగనివ్వడం లేదని నడ్డా అన్నారు. విపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లేని నాయకుడు రాహుల్ గాంధీ అంటూ వ్యాఖ్యానించారు. 


More Telugu News