రేపు సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటన.. పాల్గొనే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు!

  • రేపు, ఎల్లుండి సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటన
  • ఇడుపులపాయ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన ఇడుపులపాయ వెళుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఐఎస్ డబ్ల్యూ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ, సీఎం పర్యటనకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు చేయాలని నిర్ణయించామని, కొవిడ్-19 స్వాబ్ టెస్ట్ చేయించుకున్న వారికే ఈ పర్యటనలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం పర్యటనలో స్డాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (ఎస్ఓపీ) తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు.

ఎస్పీ వెల్లడించిన ఇతర వివరాలు ఇవే..

  • సీఎం జగన్ ఈ నెల 7 మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయ వస్తారు.
  • వీరన్నగట్టుపల్లె క్రాస్ నుంచి ఏడు చెక్ పోస్టుల ఏర్పాటు.
  • హెలిప్యాడ్ కు కొంచెం దూరంలో రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్ల ఏర్పాటు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు బారికేడ్ల వరకే అనుమతి. అది కూడా 36 మందికే అనుమతి.
  • ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు సీఎం కుటుంబ సభ్యులు, వీఐపీలకే అనుమతి.
  • ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ తరగతి గదుల ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఉంటుంది. ఈ కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు అనుమతి. బయటి నుంచి వచ్చిన వారికి అనుమతి ఉండదు.


More Telugu News