బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ భారీ చిత్రం!

  • ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న ప్రభాస్ 
  • తదుపరి చిత్రానికి ఓమ్ రావత్ దర్శకత్వం
  • ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టీ సీరీస్ బ్యానర్లో  
ప్రభాస్ గురించి చెప్పాల్సి వస్తే కనుక 'బాహుబలి'కి ముందు.. 'బాహుబలి'కి తర్వాత అన్నట్టుగా ఆయన కెరీర్ గురించి చెప్పాలి. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. జాతీయ స్థాయిలో ఆయనకు మార్కెట్ ఏర్పడింది. దీంతో ఆయన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో భారీ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడితో చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం ఆయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చిత్రాన్ని పూర్తిచేస్తున్నాడు. దీని తర్వాత 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ చిత్రాన్ని చేయాల్సివుంది. ఇక దాని తర్వాత, మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ టీ సీరీస్ ప్రభాస్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి ఓమ్ రావత్ ('తానాజీ' దర్శకుడు) దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఇప్పటికే వీరి మధ్య చర్చలు కూడా జరిగినట్టు చెబుతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. ప్రభాస్ కు ఇది 22వ చిత్రమవుతుంది. ఇందులో కథానాయిక పాత్రకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.  


More Telugu News