'కోవిడ్-19' కట్టడి వైఫల్యంపై రాహుల్ వ్యంగ్యంతో కూడిన విమర్శలు!

  • వైఫల్యాలపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో భవిష్యత్తులో కేస్ స్టడీ
  • అందుకు ఈ మూడు అంశాలను తీసుకుంటారు
  • 1.కొవిడ్‌-19, 2.పెద్ద నోట్ల రద్దు, 3.జీఎస్‌టీ అమలు 
  • రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'వైఫల్యాలపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో భవిష్యత్తులో కేస్ స్టడీల కోసం మూడు అంశాలను తీసుకుంటారు. 1.కొవిడ్‌-19, 2.పెద్ద నోట్ల రద్దు, 3.జీఎస్‌టీ అమలు' అని ఆయన చురకలంటించారు.

ఈ సందర్భంగా భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసులు ఎలా పెరిగిపోతున్నాయో తెలుపుతూ ఓ గ్రాఫ్‌ పోస్ట్ చేశారు. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియో కనపడుతుంది. భారత్‌లో మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఎన్ని కేసులు పెరిగిపోయాయో రాహుల్ వివరించారు.

దేశమంతా కరోనాతో పోరాడుతోందని త్వరలోనే గెలుస్తామని రెండు నెలల క్రితం మోదీ చెప్పిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇందుకు మద్దతుగా గంటలు, చప్పట్లు కొట్టాలని, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ పోస్ట్ చేసి ఎద్దేవా చేశారు.


More Telugu News