కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ పెళ్లి ఊరేగింపు.. వరుడు సహా ఐదుగురి అరెస్ట్

  • ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘటన
  • భౌతిక దూరాన్ని గాలికి వదిలి డ్యాన్సులతో హోరెత్తించిన వైనం
  • పెళ్లి జరిగిన హోటల్ సీజ్
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపు నిర్వహించిన వరుడు సహా ఐదుగురిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఈ నెల 2న వివాహం జరగ్గా అనంతరం పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారు ఒక్కరు కూడా మాస్కు ధరించలేదు సరికదా, భౌతిక దూరాన్ని గాలికి వదిలేసి డ్యాన్సులతో హోరెత్తించారు.

 ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇది కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన అధికారులు వివాహం జరిగిన ‘హోటల్ మై ఫెయిర్’ను సీజ్ చేయడంతోపాటు వరుడు, అతడి తండ్రి, ముగ్గురు మామయ్యలను అరెస్ట్ చేశారు. అలాగే, పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న రెండు వాహనాలను సీజ్ చేసినట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.


More Telugu News