చైనా సరిహద్దు వివాదంలో భారత్ కు బాసటగా జపాన్
- ఇటీవల గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా బలగాల ఘర్షణ
- దురాక్రమణ ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తామన్న జపాన్
- వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచన
టెక్నాలజీకి, ఆర్థిక పరిపుష్టికి పెట్టిందిపేరైన పసిఫిక్ ద్వీపదేశం జపాన్ చాలాకాలంగా భారత్ కు మిత్రదేశం. ఇరుదేశాల మధ్య అనేక రంగాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, చైనాతో సరిహద్దు వివాదంలో భారత్ కు జపాన్ బాసటగా నిలిచింది. వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ఎలాంటి ఏకపక్ష ప్రయత్నాన్ని అయినా తాము వ్యతిరేకిస్తామని పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఇటీవల గాల్వన్ లోయ వద్ద జరిగిన పరిణామాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా జపాన్ రాయబారి సతోషి సుజుకీకి ఫోన్ ద్వారా వివరించారు. దీనిపై సుజుకీ స్పందిస్తూ, భారత్-చైనా ఈ వివాదాన్ని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్న భారత్ విధానాలను జపాన్ ప్రశంసిస్తోందని తెలిపారు.