అదే మనం చేసిన తప్పా?: అమరావతి రైతుల దీక్షలో చంద్రబాబు

  • అమరావతి కోసం పోరాటం చేస్తోన్న రైతులకు సంఘీభావం 
  • తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఉన్నాయి
  • తెలంగాణకు హైదరాబాద్‌ ఉంది
  • ఆంధ్రప్రదేశ్‌కు ఓ గొప్ప రాజధాని ఉండాలని కోరుకున్నాం
  • రాజధాని 13 జిల్లాలకు నడిబొడ్డున నిర్మించాలనుకున్నాం
అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తోన్న రైతుల దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. విజయవాడలో అమరావతి రైతులకు సంఘీభావంగా నిరసన దీక్షలో చంద్రబాబు, చినరాజప్ప, ఆనంద్‌బాబు, కనకమేడల, అశోక్ బాబు, వర్ల రామయ్య, పట్టాభి కూర్చున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... 'దేవేంద్రుడు స్వర్గలోకానికి రాజైతే దాని రాజధాని అమరావతి.. అజరామరం.. అమరావతికి చావు లేదు. ఎవరైనా చంపాలని అనుకున్నా, అమరావతిని దెబ్బతీయాలనుకున్నా వారి ప్రయత్నాలు ఫలించవు. అమరావతికి చరిత్ర ఉంది.. ప్రాచీన నాగరికతకు చిహ్నం.. శాతవాహనుల రాజధాని' అని వ్యాఖ్యానించారు.

'అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ అభినందనలు. అమరావతి ఉద్యమానికి అల్లూరి సీతారామ రాజు మనకు స్ఫూర్తిగా నిలవాలి. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి. రాజధాని ఎక్కడో తెలియదు. ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు.. ఈ రాష్ట్రానికి మంచి సిటీ కూడా లేని పరిస్థితి' అని చంద్రబాబు నాయుడు చెప్పారు. 

'తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్‌ వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఓ గొప్ప రాజధాని ఉండాలని కోరుకున్నాం. అదే మనం చేసిన తప్పా? అని నేను అడుగుతున్నాను. ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు ఈ రాజధాని. రాజధాని 13 జిల్లాలకు నడిబొడ్డున నిర్మించాలని అనుకున్నాం' అని చంద్రబాబు తెలిపారు.

'29 వేల మంది రైతులు 34 ఎకరాల భూమిని త్యాగం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఈ గొప్ప పనిని చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌కు నాంది పలికాం. స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధాని వస్తే తాము కూడా బాగుపడతామని వారు కలలు కన్నారు. ఎన్నో సంస్థలు అమరావతికి వచ్చాయి. వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. ఉద్యోగాలు వచ్చేవి.. రాష్ట్రం బాగుపడేది' అని చంద్రబాబు చెప్పారు.

'అమరావతి కోసం పోరాడుతున్న వారిని ఎన్నో రకాలుగా హింసించారు. మీడియాలో దీనిపై రాస్తే వారినీ ఇబ్బందులకు గురి చేశారు. చాలా మంది గుండె ఆగి చనిపోయారు. ఎప్పుడు పోలీసులు వస్తారోననుకుంటూ భయపడుతూ జీవించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నాను. అయినప్పటికీ, ఉద్యమకారులు చూపిన చొరవ అభినందనీయం. రాజధాని మార్చుతామని ప్రభుత్వం చెబుతోంది. విశాఖపట్నంలో కబ్జాలకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.


More Telugu News