టీ20 లీగ్ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతున్నట్టు కలరింగ్.. జరిగింది మాత్రం పంజాబ్‌లో!

  • శ్రీలంకలోని ప్రఖ్యాత యువా క్లబ్ పేరును వాడుకున్న నిర్వాహకులు
  • అచ్చం శ్రీలంకలో జరుగుతున్నట్టే ఏర్పాట్లు
  • ఆన్‌లైన్ బెట్టింగ్ కోసమేనంటున్న పోలీసులు
అది పంజాబ్ రాజధాని చండీగఢ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సవారా గ్రామం. అక్కడి స్టేడియంలో యువా టీ20 లీగ్ పేరుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కుర్రాళ్లు తలపడుతున్నారు. ఇది వాస్తవం. కాగా, నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను శ్రీలంకలోని బదుల్లాలో జరుగుతున్నట్టు నమ్మించారు. అంతేకాదు, ఆడుతున్నది కూడా శ్రీలంకకు చెందిన మొనరల హార్నెట్స్, వెల్లవాయ వైపర్స్ జట్లు అని కామెంటేటర్లు కూడా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా సైట్లలో చూస్తున్నవారు కూడా అదే నిజమని నమ్మారు.

కామెంటేటర్ అయితే బదుల్లాలో మ్యాచ్‌కు అంతా సిద్ధమైందని, వాతావరణం బాగుందని చెప్పడం చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో అతడి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదొక్కటే కాదు.. అందరినీ నమ్మించేందుకా అన్నట్టు స్టేడియంలో అక్కడక్కడా శ్రీలంక ప్రముఖ మొబైల్‌ కంపెనీ డైలాగ్‌కు చెందిన బ్యానర్ల ఏర్పాటు.. అంతా పకడ్బందీగా చేశారు. అయితే, కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మ్యాచ్‌లు నిలిచిపోతే ఈ మ్యాచ్ ఎలా జరిగిందబ్బా? అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసమే ఈ మ్యాచ్‌ను ఆడించినట్టు పోలీసుల విచారణలో తేలడంతో అంతా షాకయ్యారు. శ్రీలంకలో గుర్తింపు పొందిన యువా క్లబ్ పేరును వాడుకుని ఇలా బెట్టింగ్ మ్యాచ్‌కు తెరలేపారు. ఈ టోర్నీ నిర్వహించేందుకు లంకబోర్డు అనుమతి ఇచ్చినట్టు నిర్వాహకులు చూపడంతో ప్రత్యక్ష ప్రసారం కోసం ‘ఫ్యాన్ కోడ్’ అనే వెబ్‌సైట్ ముందుకొచ్చింది.

 బీసీసీఐ గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఎవరూ ఇందులో ఆడలేదని, కాబట్టి ఈ విషయంలో తామేమీ చేయలేమని తేల్చేసింది. శ్రీలంక బోర్డు కూడా ఇలాగే స్పందించింది. ఈ టోర్నీకి, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇక, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ‘ఫ్యాన్ కోడ్’ మాతృసంస్థ డ్రీమ్‌ స్పోర్ట్స్‌ కాగా, దీనికే చెందిన బ్రాండ్, ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘డ్రీమ్‌ 11’ ఐపీఎల్‌ స్పాన్సర్లలో ఒకటి. దీనికి టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు.


More Telugu News