ఏమాత్రం తగ్గని ట్రంప్... కరోనా 'చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి' అంటూ వ్యాఖ్యలు

  • ఇప్పటికే చైనా వైరస్ అంటూ వ్యాఖ్యలు
  • చైనా పునరావృతం చేసిందంటూ విమర్శలు
  • ఇలా జరగడానికి చైనానే కారణమన్న ట్రంప్
యావత్ ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా రక్కసిని చైనా వైరస్ అంటూ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబ్ లో ఉద్భవించిందని, వైరస్ ఉనికిని చైనా ఉద్దేశపూర్వకంగా దాచిందని అనేక రకాల ఆరోపణలు చేసిన ట్రంప్ తాజాగా కరోనా వైరస్ ను 'చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి'గా పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో వచ్చిన ప్లేగు వ్యాధి ధాటికి ప్రజలు విలవిల్లాడారని, ఇలాంటిది అసలు మళ్లీ జరగకూడదని భావిస్తే  చైనా దాన్ని పునరావృతం చేసిందని ఆరోపించారు. "ఓ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామో లేదో వైరస్ వ్యాప్తి మొదలైంది. ఆ సంతకం సిరా ఆరకముందే మహమ్మారి బయటపడింది, ఇలా జరగడానికి చైనానే కారణం" అంటూ ట్రంప్ ఘాటుగా విమర్శించారు. వైట్ హౌస్ లో జరిగిన స్పిరిట్ ఆఫ్ అమెరికా షోకేస్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News