వైఎస్ జగన్ ఆ గేమ్ జోలికి వెళ్లరు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • ఒక ఎంపీ పోయినా ఫర్వాలేదన్న సజ్జల
  • జగన్ ఎప్పుడూ ఎంపీల బలం చూసుకోరని వ్యాఖ్యలు
  • జగన్ ప్రజాబలాన్నే చూస్తారని వెల్లడి
వైసీపీ నేతలు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంశాన్ని తేల్చేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు పిటిషన్ సమర్పించారు. ఈ పరిణామాలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పార్టీ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో గందరగోళం సృష్టించేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నాడని అన్నారు. క్రమశిక్షణ లేదని, మిగిలిన వాళ్లు కూడా అదే బాటలో నడిస్తే సరికాదన్న ఉద్దేశంతో చర్యలకు ఉపక్రమించామని తెలిపారు.

వాస్తవానికి తమ పార్టీలో ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ ఎంతో డబ్బు పోసి కొనుక్కున్న నేతలు కూడా ఇలా మాట్లాడలేదని వెల్లడించారు. అందుకే షోకాజ్ నోటీసులు పంపామని, అనర్హత వేటువేయాల్సి వస్తోందని సజ్జల వివరించారు.

"22 మంది ఎంపీల్లో ఒక ఎంపీ పోతాడేమో అని కొందరు, ఇద్దరు, ముగ్గురు ఎంపీలు పోతే ఎలా? అని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. కానీ అలాంటి గేమ్ జోలికి వైఎస్ జగన్ అస్సలు వెళ్లరు. అదేదో బలం అని ఆయన అనుకోరు. ఆయన ఎప్పుడూ ప్రజా బలాన్నే చూస్తారు. అంతేతప్ప ఇలాంటి వాళ్లను బుజ్జగించాలని చూడరు. అవతలి వ్యక్తుల వాదనలో నిజం ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడ్డానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ అది ఫలించలేదు. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత బాధ కలిగించేలా ఉన్నాయి" అంటూ సజ్జల వెల్లడించారు.


More Telugu News