టిక్ టాక్ వంటి యాప్ లు రూపొందించడం తేలికే... వాటిని విజయవంతం చేయడమే ఎంతో కష్టం: టెక్ మహీంద్రా సీఈవో

  • దేశంలో చైనా యాప్స్ కు గడ్డుకాలం
  • దేశీయ యాప్స్ కు ప్రోత్సాహం
  • యాప్స్ తీసుకువచ్చే ఉద్దేశం లేదన్న గుర్నానీ
ఇటీవల సరిహద్దుల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. కేంద్రం కూడా తనవంతుగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది. వాటిలో టిక్ టాక్ వంటి ఎంతో ప్రజాదరణ పొందిన యాప్ కూడా ఉంది. దాంతో దేశీయంగా టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా యాప్ లు తీసుకురావాలంటూ పలువురు పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాలపై ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ 'ఎకనామిక్ టైమ్స్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్పందించారు.

టెక్ మహీంద్రా యాప్ ల రూపకల్పన జోలికి వెళ్లదని, ఐటీ సేవలు, యాప్ ల తయారీ అంశం రెండు భిన్నమైనవని, ఈ రెండింటిని కలపాలని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. అయితే, టిక్ టాక్ వంటి యాప్ ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పెద్ద విషయమేమీ కాదని గుర్నానీ అభిప్రాయపడ్డారు. ఓ ప్రాజెక్టు కోసం వంద కోట్ల డాలర్లు అవుతుందనుకుంటే, అందులో టెక్నాలజీకి అయ్యే ఖర్చు కోటి డాలర్లు మాత్రమేనని, మిగతా 99 కోట్ల డాలర్లు మార్కెటింగ్, ఇతర వ్యవస్థల కోసం ఖర్చు అవుతుందని వివరించారు.

టెక్నాలజీ సాయంతో తాము కూడా ఓ వాట్సాప్ వంటి యాప్ ను ఎంతో సులువుగా రూపొందించగలమని, కానీ వాటిని విజయవంతం చేయడమే అత్యంత క్లిష్టమైన అంశమని తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా మరో కంపెనీ స్థాపించాల్సి ఉంటుందని, ఇప్పుడు తాము అనేక సేవలతో బిజీగా ఉన్నందున ఈ దిశగా దృష్టి సారించలేమని గుర్నానీ పేర్కొన్నారు.


More Telugu News