మాకు తెలిసినంతవరకు ఆ రూ.151 కోట్లు అచ్చెన్నాయుడు ఒక్కరే దోచుకుని ఉండరు: జోగి రమేశ్

  • కార్మికుల సొమ్ము దోచుకున్నారంటూ ఆగ్రహం
  • అచ్చెన్న అప్రూవర్ గా మారితే మీ మెడకు చుట్టుకుంటుందని వెల్లడి
  • చంద్రబాబుకు తెలియకుండానే జరిగిందా అంటూ మండిపాటు
సీఎం జగన్ ఇవాళ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించడంపై ఆ పార్టీ నేత జోగి రమేశ్ స్పందించారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలకు 50 శాతం ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు. నాడు అంబేద్కర్, పూలే వంటి మహనీయులు చెప్పిన విషయాన్ని నేడు సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ టీడీపీ నేతలపైనా విరుచుకుపడ్డారు.

బీసీలను అణగదొక్కుతున్నారని, బీసీలపై అక్రమ కేసులు పెడుతున్నారని కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమ వంటివాళ్లు ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. "అచ్చెన్నాయుడు బీసీ అంటున్నారు, మరి కార్మికుల్లో బీసీలు లేరా? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లేరా? వారు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును రూ.151 కోట్ల మేర దోచుకున్నారు. అలాంటి నేతకు మీరు వత్తాసు పలుకుతున్నారు. అచ్చెన్నాయుడు ఈ కేసులో అప్రూవర్ గా మారితే మీ మెడలకు చుట్టుకుంటుంది. ఈ కుంభకోణంలో మాకు తెలిసినంతవరకు అచ్చెన్నాయుడు ఒక్కరే రూ.151 కోట్లు దోచుకుని ఉండరు. అప్పటి సీఎం చంద్రబాబుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా?" అంటూ జోగి రమేశ్ నిలదీశారు.

అంతేకాదు, మచిలీపట్నంలో జరిగిన మోకా భాస్కరరావు హత్యోదంతాన్ని కూడా ప్రస్తావించారు. బలహీనవర్గ కులాల మధ్య చిచ్చుపెట్టడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. మోకా భాస్కరరావు, కొల్లు రవీంద్ర ఒకే బలహీన వర్గానికి చెందినవారని తెలిపారు. మచిలీపట్నంలో బలహీనవర్గాల నేతగా మోకా భాస్కరరావు ఎదుగుతుండడంతో ఓర్వలేక చంద్రబాబు ప్రోద్బలంతో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ హత్య జరిగిందని ఆరోపించారు.


More Telugu News