సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఐదుగురికి కరోనా
- ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజేషన్
- గత నాలుగు రోజులుగా గజ్వేల్‌లోని సొంత ఇంట్లో కేసీఆర్
- అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భయపెట్టేలా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులు కరోనా బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. ముఖ్యమంత్రి గత నాలుగు రోజులుగా గజ్వేల్‌లోని ఆయన సొంత నివాస గృహంలో ఉంటుండడంతో ఆయనకు ముప్పు తప్పింది. ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకడం ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపగా, దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.