మయన్మార్ లో విషాదం... బురదనీటిలో చిక్కుకుని 113 మంది దుర్మరణం
- మయన్మార్ లో భారీ వర్షాలు
- గనుల్లో పనిచేస్తున్న కార్మికులపై బురద పంజా
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం!
మయన్మార్ లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు పెను విషాదానికి కారణమయ్యాయి. కాచిన్ రాష్ట్రంలోని వర్షాలకు భారీ ప్రమాదం జరగడంతో రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో పడ్డాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది. దాంతో కార్మికులు ఆ బురదనీటిలో ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మరణించారు.