యూనివర్శిటీల్లో కూడా ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారు.. ఎక్కడ చూసినా వాళ్ల పెత్తనమే: సీపీఐ రామకృష్ణ

  • రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైంది
  • పార్టీ, యూనివర్శిటీల్లో మీ వాళ్లే ఉంటున్నారు
  • విమర్శించే వారికి కులం ముద్ర వేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైపోయిందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని యూనివర్శిటీలలో వారికి సంబంధించిన వారు, వాళ్ల బంధువులే ఉన్నారని... విశ్వవిద్యాలయాల్లో ఎవరూ మాట్లాడటానికి కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కూడా కేవలం నలుగురి చేతిలో మాత్రమే ఉందని చెప్పారు. ఈ రాష్ట్రం మీ కోసమే ఉందా? అని ప్రశ్నించారు.

సామాజికన్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నారని... ఇతరుల మొహాన రేషన్ కార్డు పడేస్తే సామాజికన్యాయం అవుతుందా? అని మండిపడ్డారు. కింద నుంచి పై వరకు మొత్తం మీరే పంచుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఇతరులు ఏదైనా మాట్లాడితే కులం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. గ్రామగ్రామాన ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. ప్రతి యూనివర్శిటీలో మీటింగులు పెడతామని చెప్పారు.


More Telugu News