హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధింపు సూచనలు.. ఇంటికెళ్తున్న ఏపీ వాసులు.. నేడూ భారీగా ట్రాఫిక్‌ జామ్

  • త్వరలోనే తెలంగాణ కేబినెట్‌ భేటీ
  • మరోసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ పై నిర్ణయం
  • సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ జామ్ 
  • వాహనాల రిజిస్ట్రేషన్లు‌, ఈ-పాసులు లేకపోతే వెనక్కే
త్వరలోనే తెలంగాణ కేబినెట్‌ భేటీ అయి మరోసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించనున్నదన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కనపడింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్‌తో పాటు, కొరపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి.

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై కూడా భారీగా రద్దీ ఉండడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు‌, ఈ-పాసులు లేకపోవడంతో కొన్ని వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్దామనుకున్న కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద కూడా భారీగా వాహనాలు కనపడ్డాయి.


More Telugu News